- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, నిజామాబాద్ జిల్లాకు చేసిన అభివృద్ధి, సేవలు మరువలేనివని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ నాయకునిగా పనిచేసి కాంగ్రెస్ లో అంచలంచెలుగా ఎదిగిన నేత డిఎస్ అని తెలిపారు. అందుబాటులో లేకపోవడంవల్ల విగ్రహ ఆవిష్కరణకు రాలేక పోయామని తెలిపారు. గత సంవత్సరం ధర్మపురి శ్రీనివాస్ స్వర్గస్తులైనప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వచ్చి డి.శ్రీనివాస్ పైన కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పినట్టు గుర్తు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రానికి, జిల్లాకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేశారాని అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ శోకసముద్రంలో ఉన్నప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వచ్చి డి శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని విన్నవించుకోగా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డి.శ్రీనివాస్ తో సన్నిహితం ఏర్పడ్డాయని అన్నారు. ఆయన చాలా సున్నితమైన మనిషి అని, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి దిశ నిర్దేశం చేశారని, రాజనీతి అనుభవజ్ఞుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, సహకార కార్పొరేషన్ చైర్మన్, డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఏం సి సి చైర్మన్ ముప్పగంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, శరత్, ఐ సి డి ఎం ఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయా రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, డిసిసి డెలికేట్ ధర్మ గౌడ్, రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, నిజాంబాద్ రూరల్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామల గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
