Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 9:38 pm Posted by : ramakrishna

జడ్పీ సిఈఓగా డి.సాయాగౌడ్

  • ఇతరుల ప్రయత్నాలు విఫలం
  • అల్లంతా దూరంలో ఆ కొఠారి
  • ఎన్నికల్లో వృధా ఖర్చులు ఉండవిక

 

జిల్లా పరిషత్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా పరిషత్ సిఈఓగా డి. సాయాగౌడ్ ను నియమిస్తూ  పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేసారు.    స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖాళీలు ఉన్న జిల్లాల్లో సిఇఓ పోస్టులను నియమించారు. ఈయన నిజామాబాద్ జిల్లాలో డిఆర్డిఎ పిడిగా బాద్యతలను నిర్వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి బదిలీ చేసి జడ్పికి సిఈఓగా పంపించారు. జిల్లా పరిషత్ కు శాశ్వత అధికారిగా ఉంటూ, డిఆర్డిఎకు ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారని తెలిసింది.

  • జడ్పికి ముమ్మర ప్రయత్నాలు…

ఆడిట్ లేని నిధులను ఎన్నికల వేళ  సంపాదించుకుందామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి.  జిల్లా పరిషత్ కు శాశ్వత అధికారి ఉన్నప్పటికీ, విదేశాలకు వెళ్లి వచ్చాక హైదరాబాద్ లోని శిక్షణ కేంద్రానికి బదిలీ చేయించుకున్నారు. కొన్నాళ్ళు డిప్యూటి సిఈఓ జి.సాయన్న ఇంచార్జ్ సిఈఓగా ఉన్నారు. స్థానిక సంస్థల సమయంలో జిల్లా పరిషత్ కు కీలకమైన పోస్ట్ లను నియమించాలని ప్రభుత్వం భావించింది. దీంతో ప్రస్తుతం ఉన్న అధికారులు ఉంటే ఎన్నికల వేళ రూపాయి రాదని గమనించి, తమకు అనుకూలమైన అధికారులను తెప్పించుకుందామని ముమ్మర ప్రయత్నాలు చేసారు. దీనిలో భాగంగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళిన అధికారితో పాటు మరో ఇద్దరి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇందులో ఒకరు విరమణ దగ్గర ఉందని, అవకాశం ఇవ్వాలని పట్నం నుంచి పైరవి చేసారు. ఇంకొకరు జడ్పిలోని  సిబ్బంది గురించి ఆరా తీసి వస్తే వారి వల్ల ఇరుక్కుంటామని వెనుకంజ వేసినట్లు తెలిసింది. గతంలో ఎన్నికల సమయంలో విపరీతమైన ఖర్చులను చూపెట్టి భారీగా ఆ నలుగురు దిగ మింగారు. ఇప్పుడు అదే మాదిరిగా దండుకుందామని యోచించి విఫలమయ్యారు. జడ్పికి సిఈఓగా బాద్యతలు తీసుకోబోతున్న డి. సాయాగౌడ్ తోపాటు ప్రస్తుతం ఉన్న డిప్యూటి సిఈఓ జి.సాయన్న విధులలో నిక్కచ్చిగా ఉంటారు. ఈ అధికారుల వల్ల తమ స్థానం గడ్డి వాము దగ్గర కుక్కలా మారబోతుందని, వారు తినరు, మమ్మల్ని తిననియ్యరని వారి చుట్టు ఉన్నవారితో గోడు వెల్లబోసుకుంటున్నారని తెలిసింది.