నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, మేఘనా డెంటల్ కళాశాలలో వైద్యులు, అధ్యాపకులు, ఇంటర్న్‌లు, వైద్య విద్యార్థుల కోసం “సైబర్ జాగ్రూకత దివస్” పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో సమాజ ఆరోగ్య పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న వైద్యులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి, జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో వైద్యులు, వైద్య విద్యార్థులు కూడా సైబర్ నేరస్థుల లక్ష్యంగా మారుతున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా బాస్ స్కామ్, ప్రకటనల ద్వారా మోసాలు, గుర్తింపు చోరీ, క్రెడిట్/డెబిట్ కార్డు మోసాలు, అలాగే డిజిటల్ అరెస్ట్, ఫిషింగ్, క్యూఆర్ కోడ్, యుపిఐ, ఎపికె ఫైల్ మోసాలు వంటి వివిధ రకాల సైబర్ నేరాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారం, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్ లు, యుపిఐ పిన్, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింకులను క్లిక్ చేయకుండా, అపరిచిత మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా, సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా నష్టపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు వివరించారు. వైద్య విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, అధ్యాపకులు, విద్యార్థులు సైబర్ భద్రతపై తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమణరావు, ఎస్‌ఐలు ప్రవళిక, రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 560 మంది వైద్యులు, అధ్యాపకులు, ఇంటర్న్‌లు, వైద్య విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.
