Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 10:12 pm Posted by : ramakrishna

విరివిగా పంట రుణాలు పంపిణీ చేయాలి

  • జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేస్తూ, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు దోహదపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి,  ప్రస్తుత వానాకాలం పంటలకు గాను రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ. 17990.59 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 13928.92 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని వార్షిక ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని,  రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని అన్నారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న రుణ వసతి గురించి వారికి అవగాహన కల్పిస్తూ, ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు చొరవ చుపాలన్నారు. అదేవిధంగా వివిధ వర్గాల అభ్యున్నతి, ఆర్ధిక ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల కింద బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలని అన్నారు. వీధి వ్యాపారాలు నిర్వహించే వారికి సూక్ష్మ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని, తద్వారా వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్ధిక తోడ్పాటును అందించినట్లు అవుతుందన్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాలలో అరవై సంవత్సరాలు పైబడిన వారికి కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి, అవసరమైన వారికి రుణాలు అందించాలని సూచించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది  దివ్యాంగులు సభ్యులుగా ఉన్న సంఘాలకు కూడా బ్యాంకులలో ఖాతాలు తెరిచేందుకు అనుమతించాలని అన్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్బీఐ ఎల్.డీ.ఓ రాములు, డీఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Crop loans should be distributed widely.