Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 2:11 pm Posted by : ramakrishna

అర్వింద్ కు మంచి పేరు రావొద్దనే విమర్శలు

. పసుపు బోర్డు కార్యాలయానికి భవనం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: పసుపు రైతుల ధ్యేయంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఢిల్లీ కేంద్రంగా తీవ్ర కృషి చేసి జాతీయ పసుపు బోర్డును సాధించారని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు.

నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయం కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమానికి రూపాయి కేటాయించ లేదని విమర్శించారు. పసుపు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ అర్వింద్ బోర్డు సాధించడాన్ని ఓర్వలేక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు.

2019 ఎన్నికల నాటి నుంచి అర్వింద్ పసుపు బోర్డు సాధించే సంకల్పంతో ప్రతిరోజూ శ్రమించారన్నారు. ఎన్నికల సమయంతో తాను వద్దని వారించినా పసుబోర్డు కోసం బాండ్ పేపర్ రాసించిన అర్వింద్ చివరకు బోర్డును సాధించి నిజామాబాద్ లో ఏర్పాటు చేయించారన్నారు. గతంలో ఎన్నడూ పసుపుపై చర్చ జరగలేదని, అర్వింద్ చిత్తశుద్ధి కారణంగానే పసుపు ధర, బోర్డుపై చర్చ ప్రారంభమైందన్నారు.

బోర్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు పోటీపడినప్పటికీ అర్వింద్ రెండు నెలలు ఢిల్లీలోనే ఉండి తెలంగాణకు తీసుకువచ్చారని కొనియాడారు. అలాగే పసుపు ధర తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి అర్వింద్ కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి పసుపు దిగుమతి కాకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.