. . . లీగ్ లకే గల్లీని దాటిన ఆన్ లైన్ బెట్టింగ్
. . . ఐపీఎల్ సందర్భంగా జోరందుకున్న ఆన్ లైన్ బెట్టింగ్
. . . ఆన్ లైన్ ఐడిల జారీకి గల్లీ గల్లీలలో చోటా, మోటా ఏజెంట్లు
. . . రోజు వారి వసూళ్లకు ఐడి కార్డులు ఉన్న వారి తోనే పని
నిజామాబాద్ , బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిత్యం ఆన్ లైన్ బెట్టింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. మార్చి చివరి ఆఖరులో ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహకులకు కోట్ల రూపాయల ను సంపాదించి పెడుతుంది.. జిల్లాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో పోలీస్ శాఖ దూకుడుగా వ్యవహరించింది. పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన ప్రధాన ఏజేంటును పట్టుకుని కటా కటాల వెనక్కి పంపింది.. నిజామాబాద్ నగరంలో పొలిటికల్ ముసుగులో ఉన్న ఇన్ చార్జి కార్పొరేటర్ పై దృష్టి సారించింది. కార్పొరేటర్ క్యాంపు కార్యాలయం అడ్డాగా ఐడీలు జారీ చేయడం, వసూలు చేయడం సొంత తమ్ముడితో ఇతరులతో సహ దందా సాగించిన వ్యక్తిని అష్ట దిగ్బంధం చేశారు. అంతే తరువాత ఏం జరిగింది అనేది తెలియదు.. మళ్లీ ఇప్పుడు క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ మూడు స్మార్ట్ ఫోన్ లు.. ఆరు స్మార్ట్ ఐడిల చందంగా సాగుతుంది..
నిజామాబాద్ నగరంలో ఆన్ లైన్ బెట్టింగ్ అంతా ప్రెస్ పేరుతో సాగుతుంది. నాలుక కోస్తే అక్షరం ముక్కరాని కొందరు ప్రెస్ (మీడియా) ఐడి కార్డులను మెడలో తగిలించుకుని, బైక్ లకు నంబర్ ప్లేట్ స్థానంలో ప్రెస్ స్టిక్కర్ లను అంటించి ఆన్ లైన్ బెట్టింగ్ ను కొనసాగిస్తున్నారు. గతంలో పిక్ పాకేటర్ లుగా, సైకిళ్ల దొంగలుగా పోలీసులు పట్టుకుని జైలు ఊచలు లెక్క పెట్టిన వారే ఇప్పుడు ప్రధాన బూకిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని అంతటా కోడై కుస్తోంది. వైన్ షాపులలో పర్మీట్ రూం లలో పనిచేసి యజమానికి లక్షల టోకరా వేసిన వారు.. గంజాయి కేసులలో, గొడవలకు దిగి షీట్ లలో రికార్డులకు ఎక్కిన వారు ఇప్పుడు అంతా ప్రెస్ అంటూ ప్రజల్లో చలామాణి అవుతున్న వారి చీకటి కోణం అంతా క్రికెట్ బెట్టింగ్ అనేది బహిరంగ రహస్యమే.. పేరుకే జీరో చిట్టీలు నడుపుతున్నామని కలరింగ్ ఇస్తున్న అందులో కి ఆన్ లైన్ ఐడీల నిర్వాహకుల ద్వారా జరిగే లావాదేవిలకు (మ్యూల్ అకౌంట్ లు) అవే కేరాఫ్ అని విశ్వసనీయ సమాచారం. రోజువారిగా యువతను, విద్యార్ధులను, కూలి పని చేసేవారిని వదలకుండా ఐడిల జారీ జోరుగా సాగుతుంది. ఐడీలు తీసుకుని బాల్ టూ బాల్, రన్ లు, ఆఫ్ సెంచరీ, సిక్స్ లు, ఫోర్ లు, గెలుపు, ఓటముల పై పందేలు కాసిన వారి నుంచి ఐడీల జారీ సమయంలోనే వస్తున్న డబ్బులు అంతా బోదన్ బస్టాండ్ వద్ద ఉన్న మొబైల్ పాయింట్ సమీపంలోని ఆఫీస్ నుంచే జరుగుతున్నట్టు తెలిసింది…

జూదం, బెట్టింగ్ లను అరి కట్టాల్సిన శాఖలో గతంలో పనిచేసిన ఇద్దరు, ముగ్గురు అధికారులకు వాటాలను ఇస్తామని చిన్న ఏజేంట్లను వారిని కలిసి పరిచయం చేసి వారిలో భరోసా నింపి ఆన్ లైన్ క్రికేట్ బెట్టింగ్ దందాకు తెర లేపారు. ఇప్పుడు సంబంధిత అధికారులు లేకపోయిన వారు ఇచ్చిన ధైర్యంతో సదరు సుడో రిపోర్టర్లు ఇప్పుడు సర్వం తమదే అన్నచందంగా నడుపుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ సంబంధిత ఏరియాలలో తమకు సంబంధించిన వ్యక్తులే నిర్వహించాలి ఇతరులు నిర్వహిస్తే వారిని పట్టుకోవడం లోకల్ వారికే అప్పగించడం విశేషం..ఆన్ లైన్ బెట్టింగ్ కేసులలో గతంలో దొరికిన వారిని చేరదీసి వారి చేతనే మళ్లి మళ్లి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. ముజాహిద్ నగర్ కు చెందిన పాత నేరస్థుడు (ఆన్ లైన్ బెట్టింగ్ లో గతంలో టాస్క్ పోర్స్) దాడిలో పట్టుబడిన సూత్రదారిని డైరీ ముసుగులో బెట్టింగ్ నిర్వహించడం కొసమెరుపు. ఎల్లమ్మగుట్టకు చెందిన పాన్ డబ్బ నడిపి ఆన్ లైన్ ఐడీల జారీలలో తురుము పేరుగాంచిన ఇద్దరు యువకులను బినామీగా ఈ దందా కొనసాగుతుందని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. రైల్వే స్టేషన్ ప్రాంతాలలో సిగరేట్లు, బీడిలు, గంజాయి ప్యాకెట్లను అమ్మినవారిని కూడా దగ్గర తీసుకుని వారి ద్వారా ఐడిలు జారీ చేసి బెట్టింగ్ నిర్వహణను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ఏడాది బెట్టింగ్ లో ఐడిలు జారీ చేసేవారిపై స్థానిక ఒక పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు కాగా దానిని నీరుగార్చారని తెలిసింది. ప్రస్తుతం కొందరిని గల్ఫ్ దేశాలు వెళ్లారని చెబుతు పొరుగు జిల్లాలకు తరలించి అక్కడ నుంచి ఐడీ ల జారీ వసూళ్ల కార్యక్రమంతో ఈ సీజన్ లో కోట్లు కొల్లగొట్టే పనిలో పడ్డారు ప్రెస్ లో పనిచేస్తున్న అనర్హులు. లీగ్ దశలో జోరందుకున్న క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ సెమి పైనల్, పైనల్ నాటికి దూకుడుగా పరుగులు తీయడం ఖాయమైంది..