Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 9:39 pm Posted by : ramakrishna

మద్యం టెండర్లకు కిక్కు

  • ఒక్కరోజే 83 దరఖాస్తులు
  • 102 షాప్ లకు 232 దరఖాస్తులు
  • నిజామాబాద్ టాప్.. భీంగల్ లాస్ట్

 

నిజామాబాద్, బతుకమ్మ : 2025-27లో మద్యం షాప్ ల నిర్వాహణకు టెండర్ల దాఖలుకు ఆశవాహులు జోరు పెంచారు. గడిచిన నెల 26న లిక్కర్ లైసెన్స్ ల కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. ఈ నెల 18 వరకు టెండర్ల దాఖలు ఎక్సైజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం విధితమే. ఈ సంవత్సరం 150 కోట్ల లక్ష్యంగా మద్యం దుకాణాల కోసం టెండర్ ఫారాలను విక్రయించాలని ఆబ్కారి శాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం గత మద్యం పాలసీలో టెండర్ ఫారం ధర రూ.2 లక్షలు ఉండగా ఈసారి 3 లక్షలకు పెంచింది. గత రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలకు వచ్చిన ఆదాయన్ని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎక్కువ మంది మద్యం షాప్ ల కోసం  పోటీ పడుతారని, ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రూ.3 లక్షల దరఖాస్తు ఫారానికి తొలుత ఆశవాహులు ఆసక్తి చూపలేదు. గత పది రోజులుగా ఒకటి,రెండు అంటూ మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలవుతున్న విషయం తెల్సిందే. సోమవారం ఒక్కరోజే 83 దరఖాస్తులు రావడంతో అధికారుల్లో ఆశలు పెరిగాయి. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుదారులు రాక స్వయంగా ఎక్సైజ్ అధికారులే వ్యాపారులకు ఫోన్ చేసి టెండర్లు వేయాలని ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండవ యేడాది కూడా మద్యం దుకాణాల నిర్వాహణకు గౌడ కులస్తులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు షాప్ లు ఉండగా అక్కడ కూడా టెండర్ల దాఖలుకు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 13 వరకు 232 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే రూ.6 కోట్ల 96 లక్షలు సమకూరింది. ఈ సంవత్సరం రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుండగా చివరి 17,18 తేదిల్లో టెండర్లు అత్యధికంగా దాఖలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లను చేసి సిద్దంగా ఉంచారు. రిజర్వు స్థానాల్లో టెండర్ల దాఖలుకు ఆయా సామాజిక వర్గాల వారు ఆచితూచిగా టెండర్లు వేస్తుండగా సిండికేట్ వ్యాపారులు మాత్రం తామే ఆయా సామాజిక వర్గాల నుంచి టెండర్లు వేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నిజామాబాద్ ఎస్ హెచ్ వో పరిధిలో 36 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు 86 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో 18 షాప్ లకు గాను 38, ఆర్మూర్ లో 25 షాప్ లకు 54 దరఖాస్తులు, భీంగల్ ఎస్ హెచ్ వో పరిధిలో 12 వైన్ షాప్ లకు 32 దరఖాస్తులు రాగా మోర్తాడ్ ఎస్ హెచ్ వో పరిధిలో 11 షాప్ లకు 22 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటికి టెండర్ దాఖలు కానీ వైన్ షాప్ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా సామాజిక వర్గాల వారీగా ఓపెన్ కేటగిరి గా ఉంటే టెండర్లు వేయాలని వ్యాపారులను ఆహ్వానించే పనిలో పడ్డారు. మద్యం దుకాణాల ఓపెన్ టెండర్ ద్వారా అప్పగించే ప్రక్రియను ఈ నెల 23న జరుగనుంది. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసే వారు ముహూర్తాలు చూసుకుని జాతకాల ప్రకారం నమోదవుతున్నాయని చెప్పాలి. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మూడు లక్షల రూపాయల దరఖాస్తు ఫారంను ఏర్పాటు చేయగా చాలా మంది ఒకరిద్దరు కలిసి టెండర్లు వేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సిండికేట్ వ్యాపారులు కాకుండానే కొందరు తమ లక్ ను పరీక్షించుకునేందుకు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. లక్ష్యం కొండంత ఉండగా ఈసారి గడిచిన సీజన్ లో వచ్చిన ఆదాయాన్ని మించి నాన్ రిఫండబుల్ (దరఖాస్తు ఫారాలు) ద్వారానే వస్తుందని ఆశతో అధికారులున్నారు.