నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రాబోయే రోజులలో వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారీ వర్షాలు , ఆకస్మిక వరదలు , చెరువులు, వాగులు పొంగిపొర్లడం , రహదారులు దెబ్బతినడం , చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీస్ శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలు , అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై శుక్రవారం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు , ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వరదలకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు , ప్రమాదకర వంతెనలు , వాగులు , చెరువులు , కాలువలు , జలాశయాలు , పురాతన ఇండ్లు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.భారీ వర్షాలు కురిసే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలిగే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు , అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని , వరద నీటిలో ప్రజలు , వాహనాలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని , లైఫ్ జాకెట్లు , రోపులు , టార్చిలైట్లు , పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ , కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో జిల్లా యంత్రాంగం , రెవెన్యూ , మున్సిపల్ , అగ్నిమాపక , వైద్య మరియు విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు , భద్రతా సూచనలు అందించాలని , తప్పుడు ప్రచారాలు , వదంతులను వెంటనే ఖండిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ , ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని , అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.ఈ సమావేశంలో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ , ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , మల్లేష్ , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ అంజయ్య , పి.సి.ఆర్ ఇన్స్పెక్టర్ వీరయ్య , సీఐలు , ఎస్. హెచ్. ఓ లు ,ఐటీ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.