Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:26 pm Posted by : ramakrishna

పోలీస్ ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా ఆలకించి, వాటిని చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన పోలీస్ కమిషనర్, కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని, పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

 

CP receives 39 complaints at Prajavani