Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 5:09 pm Posted by : ramakrishna

పోలీస్ ప్రజావాణి లో 39 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా ఆలకించిన కమిషనర్, వాటిని చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించడం, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేయడం, జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు. ఈ వారపు ప్రజావాణిలో మొత్తం 39 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

 

CP receives 39 complaints at 'Police Prajavani'