Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 5:53 pm Posted by : ramakrishna

పోలీస్ ప్రజావాణిలో 32 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 32 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా ఆలకించిన కమిషనర్, వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తూ, బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు లేదా పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించడం, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేయడం, జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు. ఈ వారపు ప్రజావాణిలో మొత్తం 32 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

 

CP receives 32 complaints at the Police Public Grievance Cell.