Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 7:35 pm Posted by : ramakrishna

బాల్కొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీ

 

బాల్కొండ, బతుకమ్మ :

 

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి,  బాల్కొండ ఎస్సై శైలంధర్,  మైనారిటీ ప్రెసిడెంట్ మజారుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రియాజుద్దీన్, సెక్రెటరీ ఎండి అక్బర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

CP participated in the Iftar dinner in Balkonda