నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్న ఊర పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగేందుకు చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. పండుగ జరిగే ప్రధాన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, అంబులెన్స్ లు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పండుగ ప్రాంతమంతా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. పికెట్‌లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ఊరేగింపు సమయంలో ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని, పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఊర పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ అన్ని విధాలుగా విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టిందని, ప్రజల సహకారంతో పండుగను విజయవంతంగా నిర్వహించగలమని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్బీ, సీసీఎస్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురు నాయుడు, శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఎస్‌హెచ్‌ఓ రఘుపతి, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
100