Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 6:27 pm Posted by : ramakrishna

కోర్టులు.. బెయిల్ ల చుట్టూ బీఆర్ఎస్

  •  భూ వివాదంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
  •  సీఎంఆర్ గోల్ మాల్ లో బోధన్ షకీల్.. ఇప్పటికీ పరారీలోనే..
  •  ఇద్దరికీ జైలు తప్పదని చర్చలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

కేసులు.. బెయిల్ లు.. కోర్టులు.. పిటిషన్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరినీ కదిలించినా ఇవే మాటలు. పార్టీ అగ్రనాయకులైన కేసీఆర్, కేటీఆర్ అరెస్టు తప్పదని అధికారిక కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రభుత్వంలోని పెద్దలు తరచూ ప్రకటిస్తుండగా.. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లోని ఎమ్మెల్సీ కవిత జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై బయటికి వచ్చారు. పార్టీకి, ఆ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్ లు వార్తల్లో నిలిచారు.

సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు షకీల్ పై రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు కాదా, నేడో రేపో ఆస్తులను అటాచ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే షకీల్ పరారీలో ఉన్నారు. సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారని 2024 ఫిబ్రవరి లో కోటగిరి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ జరగకముందే షకీల్ దుబాయికి జారుకున్నారు. ఆ తరువాత అతడి కొడుకు రాహిల్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు కాగా, కేసును తారుమారు చేసేందుకు యత్నించారు. విచారణ జరుగుతుండగానే రాహిల్ కూడా గల్ఫ్ పరారయ్యాడు. ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది.

మరో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి జైలుకు వెళ్లకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో జీవన్ రెడ్డి తల్లి ఏ రాజుబాయి, భార్య రజితకు హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని జీవన్ రెడ్డి ఆక్రమించడంతోపాటు తాను నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారని, తనను ఆయుధాలతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.  ప్రభుత్వం మారిన తరువాత ఆర్మూర్ లోని జీవన్ మాల్ ను సైతం అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బకాయిలు చెల్లించడం లేదని ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు చర్యలకు ఉపక్రమించారు.