. . . నాటు తుపాకులు కలిగిన 9 మంది అరెస్టు
. . . 9 నాటు తుపాకులు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
భీంగల్ మండలం దేవక్క పేట్ – కారేపల్లి అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడిన వేటగాళ్లను పట్టుకునేందుకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, భీంగల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో నాటు తుపాకులతో సంచరిస్తున్న 9 మంది పట్టు బడగా వారి వద్ద 9 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ….ఇటీవల దేవక్కపేట్ అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందిన ఘటన అనంతరం పోలీసులు, అటవీ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్న లైసెన్స్ లేని నాటు తుపాకులను అడవిలో దాచిపెట్టేందుకు తీసుకెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు తెలిపారు.. సీసీఎస్, భీమ్‌గల్ పోలీస్ లు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో భీంగల్ పరిధిలోని దేవక్కపేట్ గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు అటవీ ప్రాంతం లో అనుమానస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తులని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద మొత్తం 9 నాటు తుపాకులు లభించాయి.

అట్టి ఆయుధాలకు ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకపోవడం వలన వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నాటు తుపాకులు కలిగిన దేవక్కపేట్ కు చెందిన భుక్యా రఘుపతి, కార్ల అంజయ్య, భూక్య చందర్, ముర్ర గంగా నర్సయ్య, బానవత్ గంగారెడ్డి, మాలవత్ ధరిసింగ్ లతో పాటు కారేపల్లికి చెందిన ముడావత్ తిరుపతి, భీంగల్ మండలం అధర్శనగర్ కు చెందిన అనిమెని లింబాద్రి, తాళ్లపల్లికి చెందిన మూలవత్ కుంభలను ఆయుధాలని రిపేర్ చేసిన దేవక్కపేట్ కు చెందిన అకునురి రాజు ని కూడా అరెస్ట్ చేసి రేమండ్ నిమిత్తం కోర్టు లో హాజరు పరుచుతామని తెలిపారు. ఈ ఆపరేషన్ లో సి.సి.యస్ ఏ.సి.పి పి.శ్రీశైలం, ఆర్మూర్ ఏ.సి.పి జె.వేంకటేశ్వర రెడ్డి, సి ఐ లు సురేష్, పి.సత్యనారాయణ గౌడ్, సాయినాథ్, యస్.ఐ సి హెచ్ తిరుపతి సి.సి.యస్ భీంగల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది త్వరితగతిన చేపట్టినందుకు సీపీ సాయి చైతన్య అభినందించినారు. లైసెన్స్ లేకుండా ఎలాంటి ఆయుధాలను కలిగి ఉండటం, వాటిని ఉపయోగించడం, దాచిపెట్టడం లేదా తరలించడం చట్టరీత్యా నేరం. ఇటువంటి అక్రమ ఆయుధాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ప్రజలను కోరారు.
