. . . ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జుక్కల్, బతుకమ్మ :
తెలంగాణలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. నీట్ – యూజీ 2026 ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 9,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో హనుమకొండ జిల్లాకు చెందిన వీరయ్యగారి సహ్యు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 720 మార్కులకు 705 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 13వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన అర్హుల జాబితా ప్రకారం, ఈ ఏడాది 38,021 మంది అభ్యర్థులు వైద్య ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరంతా తమ నీట్ ర్యాంకు, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లను పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 30 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 66 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కలిపి 9,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తక్కువ ఫీజుతో వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, ధ్రువపత్రాల ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదు చేసి, సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మార్గదర్శకాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే విడుదల చేసింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత కీలకంగా మారనుంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోపు అన్ని దశలను పూర్తి చేసి, అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.