- దుబాయ్ నుంచి రాగానే అరెస్టు చేసిన ఏసీబీ
- ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఒక ఏడి అరెస్ట్
- ప్రధాన దళారి అరెస్టుతో వెటర్నరీ వైద్యులలో వణుకు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కాంలో కీలక సూత్రదారి కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో 700 కోట్ల కుంభకోణానికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆనాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ తో పాటు గొర్రెల మేకల పెంపకం సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్ నాయక్ తో పాటు పశుసంవర్ధక శాఖకు చెందిన 17 మంది అధికారులను బాధ్యులుగా చేస్తూ కేసు నమోదైంది. ఈ కేసును ఏసీబీ విచారణ చేపట్టగానే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ దుబాయ్ పరారీ అయ్యారు. కేసులో 17 మంది పరారీ కాగా ప్రధాన దళారిగా వ్యవహరించిన మొయినుద్దీన్ దుబాయ్ పారిపోగా కేసు పెండింగ్ లో ఉంది. దుబాయ్ నుంచి వచ్చిన మొయినుద్దీన్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఆనాటి ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందార్లను ప్రోత్సహించేందుకు గాను సబ్సిడీపై మేకల, గొర్రెల పంపిణీ చేపట్టిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కామారెడ్డికి చెందిన అధికారులపై కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి విహెచ్ ఏడి రవిపై సిద్ధిపేట్ జిల్లాలో పనిచేసిన కాలంలో 12 యూనిట్లలో జరిగిన కుంభకోణంకు సంబందించి అరెస్టు చేశారు. అదే సమయంలో మెడ్చల్ ఏడి కేశవ సాయితో పాటు రంగారెడ్డి (ఏడి) లను సైతం ఆనాడు అరెస్టు చేశారు. వారిలో కొందరిని ఆనాడు అరెస్టు చేయగా మిగిలిన వారిపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా మోటార్ సైకిల్, వాటర్ ట్యాంకర్ల పైన గొర్రెల, మేకలను అనంతపూర్ నుంచి తరలించినట్లు అధికారులు రికార్డులు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ వ్యవహరం బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లాలో జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన ఎల్లన్న ఇక్కడి నుంచి మంచిర్యాల జిల్లాకు బదిలీపై వెళ్లి ఎసిబికి చిక్కారు. పశు సంవర్థక శాఖ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో పశువుల డాక్టర్ లకు పాత్ర ఉందనేది బహిర్గతమైంది. ప్రధానంగా గొర్రేలు, మేకల పేంపకం దారులకు గొర్రేలు ఇవ్వకున్న ఇచ్చినట్టు సర్టిఫికేట్లు ఇచ్చిన పశువుల వైద్యుల ద్వారా జరిగిన కలెక్షన్ లు వాటాల పై స్థాయి వరకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. అదే విధంగా గొర్రేలు కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రాంతం వరకు రవాణా జరిగింది లేనిది టోల్ గేట్ల వద్ద జరిగిన టోల్ చెల్లింపుల ఆధారంగా ఈ కుంభకోణం బహిర్గతమైంది. అనంతపూర్, మహరాష్ట్ర నుంచి కొనుగోలు చేసి తెచ్చిన గొర్రేలను లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అవే గొర్రేలకు మళ్లీ ట్యాగ్ లు వేసి రిసైక్లింగ్ చేసిన వ్యవహరం ఆనాడు బట్ట బయలైంది. ఆనాడు ప్రధానంగా అధికారులను బాధ్యులను చేసినప్పటికి లబ్ధిదారులకు గొర్రేల పంపిణీలో క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యుల పాత్ర వెలుగు లోకి రాలేదని ఇప్పుడు ఆ విషయం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలో క పశు వైధ్య అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఒక యూనిట్ లో 20 ఆడ గొర్రేలు, ఒక మగ గొర్రేను తీసుకురావాల్సిన క్రమంలో మొత్తం 21 మగ గొర్రేలను తీసుకువచ్చిన ఉధంతం ఆనాడు జరిగింది. అంతే గాకుండా గొర్రెలు తీసుకు రాకుండా లబ్ధిదారుకు పంపిణి చేయకుండా పంపిణి చేసినట్లు సర్టిఫై కాఫీల ద్వారా జరిగిన తతంగంలో పశువుల దాణాను కుడా అమ్ముకున్న ఘన చరిత్రను పశు వైధ్యులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఆనాడు వందల కోట్లలో జరిగిన కుంభకోణంలో ప్రధాన కాంట్రాక్టర్ గా దళారిగా వ్యవహరించిన మొయినుద్ధిన్ అరెస్టు కావడంతో ఈ కేసులో కదలిక వచ్చే అవకాశం ఉంది. మరి కొంత మంది అరెస్టు చేసే అవకాశం ఉందనే వ్యవహరం పశు సంవర్థక శాఖ వైధ్యాధికారులలో వణుకు మొదలైంది.