. . . ఇంజనీరింగ్ అధికారుల ఆదేశాలు బేకతారు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని 16వ డివిజన్లో మురుగు కాలువలో మురికి నీరు ప్రవహించేందుకు ప్రత్యేకంగా 420 మీటర్ల పొడుగు మేరకు ప్రత్యేకంగా మురుగు కాలువకు న్యూడా పరిధిలో 2 కోట్ల బడ్జెట్ ప్రాజెక్టును కేటాయించారు. దీనికి నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇష్టానుసారంగా మురుగు కాలువను నిర్మిస్తున్నారని 16వ డివిజన్ కాలనీ ప్రజలు కార్పొరేటర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ ఆదివారం మున్సిపల్ శాఖ ఈఈ ని కలిసి మురుగు కాలువ కాంట్రాక్టర్ ఏ మాత్రం కూడా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఈ అంశంపై మున్సిపల్ ఈఈ వచ్చి జరుగుతున్న పనిని పర్యవేక్షించి కాంట్రాక్టర్ కు పనిని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇష్టానుసారంగా మురికి కాలువను నిర్మిస్తే మురుగు కాలువ నీరు అక్కడే నిలిచిపోతాయని, కాలనీవాసులకు ఇబ్బందులు ఏర్పడతాయని ఈఈ తెలిపినప్పటికీ కాంట్రాక్టర్ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేదు. ఇదే విషయంపై 16 డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత సురేష్ లు మాట్లాడుతూ మురుగు కాలువను నిర్మించడంలో నాణ్యత ప్రమాణాలు వాడడం లేదని, దానితో పాటుగా కాంక్రీట్ మిక్సింగ్ లో ఏ మాత్రము ఇసుక ను ఉపయోగించకుండా పూర్తిగా డస్టునే ఉపయోగించి మురుగు కాలువను నిర్మించే పనులు చేపడుతున్నారన్నారు.

ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకొని కాలనీ ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన మురుగు కాలువను నిర్మించి ఇవ్వాలని కాలనీవాసులు కోరుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆ మురుగు కాలువను ఆపివేసి, ముందు ఉన్న మురుగు కాలువ కొలతల ఆధారంగా ప్రమాణాలను తీసుకొని నూతన మురుగు కాలువను 424 మీటర్ల వరకు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారన్నారు.
