Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 8:50 pm Posted by : ramakrishna

జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం

 

. . . శనివారం శంకుస్థాపన కార్యక్రమం

 

. . . అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

నూతనంగా నిర్మించ తలపెట్టిన కోర్టు భవనాల సముదాయం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం రోజున ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం..

న్యాయస్థాన భవన సముదాయానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేకంగా కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానాల్లో శంకుస్థాపనలో పాల్గొంటున్నారని వెల్లడించారు. వీరితో పాటు హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఇవి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని న్యాయవాదులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో న్యాయమూర్తులు బి పుష్పలత, రాధిక జైస్వాల్,  పి లక్ష్మణ చారి, ఏ ప్రవీణ్ కుమార్, న్యాయవాదుల సంఘం సిరిసిల్ల వేములవాడ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, సదానందం సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

 

Construction of court building is a prestigious project for the district