హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జర్కుల సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం స్థానికంగా, పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి అసలైన కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శవపంచనామాకు ఎలా తరలిస్తారని వారు నిలదీశారు. అధికారుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సాయికుమార్ మొబైల్ ఫోన్‌ను వెంటనే తమకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
