బురద రాజకీయాలు మానండి
ఏమైనా విభేదాలు మీరే చూసుకోండి
మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లను పనికి రాకుండా చేసి, ఆనెపం బీఆర్ఎస్ పై వేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ మధ్య విభేధాలు ఉంటే మీరు చూసుకోవాలని, కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు. కాళేశ్వరం మోటార్లు రోజుకి రెండు మూడు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు.అలా చేస్తే బేరింగ్‌లు దెబ్బతింటాయన్నారు. బేరింగ్‌లు దెబ్బతిని మోటార్లు చెడిపోతే మళ్లీ మమ్మల్ని బద్నామ్ చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే దెబ్బతింటాయని బీహెచ్ ఈఎల్ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారని అన్నారు.తాను వారం క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాశానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ లకు నీళ్ల విలువ తెలియదని, ప్రాజెక్టుల నీళ్లను ఎందు కు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు ప్రాజెక్టులను నింపాలన్నారు. మోటార్లు ఆన్ చేయకపోతే.. వేలాది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తామన్నారు.