. . . దేవుడి సాక్షిగా ఒట్టేసి ప్రజలను వంచించిన రేవంత్
. . . నెల అన్నారు . . . 100 రోజులన్నారు . . . 1000 రోజులు కావస్తున్నా అమలు ఊసేలేదు
. . . ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలి
. . . రైతులు, మహిళలు, యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్
. . . కాంగ్రెస్ మోసాలపై ఉద్యమ కార్యాచరణ..నియోజకవర్గవ్యాప్తంగా పోరాటాలకు పిలుపు
. . . ప్రజా భాగస్వామ్యంతో సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం
. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ :
రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దేవుడిపై ఒట్టు వేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించిందని మాజీ మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం లింబగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో కాంగ్రెస్ బాకీ కార్డులకు పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎగ్గొట్టిన హామీల వివరాలతో కూడిన “కాంగ్రెస్ బాకీ కార్డు” పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఆ పార్టీ అభ్యర్థులు దేవాలయాల్లో దేవుళ్ల సాక్షిగా ఒట్లు వేసి గ్యారెంటీ కార్డులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. డిసెంబర్ 9, 2023న అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టి 100 రోజుల్లో ఈ గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని ఇంటింటికీ తిరిగి ప్రజలను నమ్మించారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోను పవిత్ర లింబాద్రి నరసింహస్వామి సాక్షిగా కాంగ్రెస్ అభ్యర్థి హామీ ఇచ్చి మాట తప్పారని ఆక్షేపించారు. 100 రోజుల గడువు కాస్తా దాటిపోయి, దాదాపు 1000 రోజులు పూర్తి కావస్తున్న ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీల కారణంగా వివిధ వర్గాల ప్రజలకు బాకీ పడిన మొత్తాలను వేముల గణాంకాలతో సహా వివరించారు.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, ఈ లెక్కన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మహిళకు ప్రభుత్వం రూ. 82,500 బాకీ పడిందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారాన్ని అమలు చేయకపోవడంతో, నియోజకవర్గంలో చెక్కులు పొందిన సుమారు 5,000 మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉందని పేర్కొన్నారు. అర్హులైన మహిళా విద్యార్థినులకు ఉచిత స్కూటర్ల పంపిణీ హామీ గాలికొదిలేశారని విమర్శించారు. ఎకరానికి రూ. 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి, పాత పథకం కింద ఇచ్చే మొత్తాన్ని కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు రైతు భరోసా రూపంలోనే దాదాపు రూ. 1,02,000 లు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఇస్తున్న రూ. 2,000 పింఛన్‌ను రూ. 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, నెలకు పెంచాల్సిన రూ. 2,000 చొప్పున ప్రతి లబ్ధిదారునికి రూ. 66,000 బాకీ పడ్డారన్నారు. దివ్యాంగులకు రూ. 6,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టడంతో ఒక్కో దివ్యాంగుడికి రూ. 66,000 బకాయి పడ్డారన్నారు. రూ. 2 లక్షల పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని,వడ్ల కొనుగోలుపై క్వింటాలుకు రూ. 500 బోనస్ అన్ని రకాల ధాన్యానికి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నిబంధనల పేరుతో మోసం చేస్తున్నారని, ఎకరానికి రూ. 12,500 చొప్పున గత ఆరు పంటలకు కలిపి రైతుకు రూ. 75,000 వరకు బోనస్ బాకీ ఉన్నారన్నారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామన్న హామీ ప్రకారం రెండేళ్లకు రూ. 24,000 బాకీ ఉన్నారన్నారని,ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12,000 చొప్పున రెండేళ్లకు రూ. 24,000 ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వలేదని, నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ. 1,32,000 బాకీ పడ్డారన్నారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ అమలు కాలేదని, రైతులు, మహిళలు, యువత,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నియోజకవర్గంలో ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. తేదీ 2 నాడు ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై బాల్కొండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలపై షెడ్యూల్ ను ఆయన వివరించారు. ఈ నెల 3న వ్యవసాయ సంక్షోభం, రైతు సమస్యలపై వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద భారీ పోరాట కార్యక్రమం, 4న మహిళా సమస్యలు నెలకు రూ. 2,500 పింఛన్లు, తులం బంగారం, కొత్త బీడీ పింఛన్ల మంజూరుపై మోర్తాడ్‌లో మహిళా సదస్సును, 5న విద్యార్థులు, యువత సమస్యలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై భీమ్‌గల్‌లో బైక్ ర్యాలీ, భారీ బహిరంగ సదస్సును, 7న కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై అన్ని మండల కేంద్రాల్లోని ప్రజావాణిలో అధికారులకు ప్రజల పక్షాన అధికారిక ఫిర్యాదుల సమర్పణ కార్యక్రమాలు తీసుకున్నట్టు ఎమ్మెల్యే వేముల వెల్లడించారు. ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఈ పోరాటంలో నియోజకవర్గ ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
