నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రుణ మాఫీ ఇవ్వకుంటే కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టండంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో మానిక్ బండార్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జీవన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానిక్ బండార్ లో నిరసనకు వేలాది మంది రైతులు తరలివచ్చారని, అదే విధంగా రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రైతులు తరలివస్తారన్నారు. రుణమాఫీ అందరికీ వర్తించే వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎ మ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిని ఎక్కడికక్కడే అడ్డుకోవాలన్నారు. వాళ్లని రోడ్ల మీద తిరగనివ్వొద్దని, రుణమాఫీ వర్తింపజేసిన తరువాతే మా ఊళ్లలోకి రావాలని స్పష్టం చేయాలన్నారు.