- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఖమ్మం, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘వైరా, మధిర, సత్తుపల్లి సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం. ఇక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలి. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతున్నారా లేదా అన్నది ప్రజలు గమనిస్తారు. ప్రతి సారీ వందిమాగధులు తమ తరఫున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వంటేజ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది. గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఆ పార్టీని తిడుతున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదు. ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదు. అయినా కూడా కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ స్పష్టంగా విఫలమైంది. ప్రజల సమస్యలపై చేయాల్సినంత పోరాటం ఆ పార్టీలు చేయటం లేదు. అందుకే ఆ బాధ్యత ను జాగృతి భుజాన వేసుకుంది. ప్రజల తరఫున కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించే ప్రయత్నం చేస్తోంది’’ అని అన్నారు.

