- ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం ఖాయం
- ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో అత్యధిక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడకుండా సామాజిక న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ, అన్ని అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రకవారం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంజం వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ ” 1965 లోనే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు అందడం లేదని,కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని లోకూర్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాని చెత్తబుట్టలో పడేసి సామాజిక న్యాయాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. మాదిగలు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పది ఏళ్ళు దేశంలో అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికి సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే చేసుకోవచ్చని తీర్పు ఇస్తే ఆ తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే సామాజిక న్యాయ వ్యతిరేకత ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్సీ వర్గీకరణ మీద ముందుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని నియంత్రించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మాలలను నెత్తి మీదకు ఎత్తుకొని మాదిగ జాతిని తన పాదాల కింద అణచివేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకువచ్చి సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్దిని చాటుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయనంత వరకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మరు అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం నూతనంగా ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఎన్నికైన ఇంజం వెంకటస్వామి మాదిగని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా కమిటీ సన్మానించారు. ఈ సమావేశంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు తెడ్డు గంగారాం, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నూతుపల్లి మారుతి, ఎంఎస్పీ జిల్లా నాయకుడు మెయిలారం బాలు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డా ప్రవీణ్ మాదిగ, ఆకారం రమేష్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున, సత్తేక్క, ఎంఎంఎస్ జిల్లా నాయకులు పద్మ, సావిత్రి, సుధ, నజీరా, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి నాగం ప్రదీప్, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, గంగా శంకర్, వినోద్, యాదగిరి, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు శ్రీడిప్ తదితరులు పాల్గొన్నారు.
