Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2024, 5:42 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది

Congress has given many opportunities

. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ: కార్యకర్తకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ లోనే సాధ్యమని, ఎంతో గొప్ప పార్టీ అయిన కాంగ్రెస్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ భవన్ ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు వీహెచ్ తదితరులు ప్రసంగించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీ భవన్ దేవాలయంతో సమానమని, తానెప్పటికీ కార్యకర్తనేనని, అందరిలో ఒకడిగా ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి వాధిలా పని చేస్తానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో పవర్ సెంటర్ అంటూ ఏమీ ఉండదని, ఉన్నది ఒక్క రాహుల్ గాంధీ వద్దేనని అన్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ లేమి లేదని, అందరూ సమర్థులేనని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భవన నిర్మిస్తామని, ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ధరకు స్థలం ఇప్పించేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎంతో మంది పేదలు, నాయకులు, కార్యకర్తలు తమ పనులనిమిత్తం గాంధీభవన్ కు వస్తుంటారని, మంత్రులు విధిగా వారం రెండు రోజులు, సీఎం నెలలో రెండుసార్లు గాంధీ భవన్ కు రావాలని ఆయన కోరారు.

హైడ్రా చారిత్రక నిర్ణయం

చెరువులు, కుంటలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన హైడ్రా చారిత్రత్మకమని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. బీఆర్ ఎస్ హయాంలో పదేళ్లలో చెరువులు, కుంటలు, వాగులను యథేచ్ఛగా  ఆక్రమించారని విమర్శించారు. ఆక్రమణల తొలగింపుతో ప్రంపంచంలోనే మేటినగరంగా హైదరాబాద్ మారుతుందన్నారు. పలుచోట్ల అక్రమార్కులు చెరువుల భూములను ఆక్రమించి పేదలకు విక్రయించారని, విషయం తెలియక కొనుగోలు చేసిన పేదలకు మోసపోయారన్నారు. మోసపోయిన పేదలకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

తెలంగాణను కుటుంబం కోసం వాడుకున్నారు

సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీ ఆర్ కుటుంబ అవసరాలకు వాడుకున్నారని, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో బీ ఆర్ ఎస్ వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుకుంటున్న వారికి సోషల్ సెన్స్ లేదని నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.