. . . ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
బీజేపీ ని దెబ్బ తీసేందుకు సిద్దాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండి పడ్డారు. ఈ మూడు పార్టీలు నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వేదికగా అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం నగర మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ తీరును, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేసు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు విమర్శలు చేస్తునే, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకురావడం వెనక ఉన్న మర్మమేమిటని ఆయన నిలదీశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు ఎందుకు మద్దతు ఇచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అభ్యర్థి స్రవంతి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కేవలం మూడ ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారని పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి బంటు రాముపై గెలవడం వెనక కాంగ్రెస్ వ్యూహం ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక ప్రక్రియల్లో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారించారని ఎంపీ ఆరోపించారు. కొందరు పోలీసులు రాజకీయ రంగు పూసుకుని మరి పని చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ వ్యానులో కూర్చోబెట్టి తీసుకురావడంలో పోలిసుల హస్తం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని విమర్శించారు. అనంతరం గెలిచిన మేయర్, డిప్యూటి మేయర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.