Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 4:06 pm Posted by : ramakrishna

మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమను తీసుకొచ్చింది కాంగ్రెస్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు. జనాలను ఇబ్బందులకు గురి చేసేది ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి ఆమె కొడుకు చావుబతుకుల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్ ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తమకు ఎవరిపై ద్వేషం లేదని, ప్రభుత్వానికి అంతా సమానమని అన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. ఫార్ముల – ఈ రేసింగ్ లో అడ్డంగా దొరికిన కేటీఆర్ మొన్నటి వరకు జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారని విమర్శించారు.