Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:27 pm Posted by : ramakrishna

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలు

 

. . . ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది

 

. . . ప్రతి గ్రామంలో కేసీఆర్ రావాలని అంటున్నారు

 

. . . ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది

 

. . . రేవంత్ రెడ్డి హామీలు మాటల దగ్గరే ఆగిపోయాయి 

 

. . . బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు తోడు దొంగల్లా మారి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్ల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి విస్తృతంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంత క్రమశిక్షణతో, సిస్టమాటిక్‌గా సమావేశం జరుగుతుందని తాను ఊహించలేదని, కార్యకర్తలు చూపిన అంకితభావం, క్రమశిక్షణ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంత గొప్పగా సమావేశం నిర్వహించడం చూస్తుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఒకసారి గెలుస్తాం.. మరోసారి ఓడిపోతామని పేర్కొన్న ప్రశాంత్ రెడ్డి ఇలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండటమే ఏ పార్టీకి అయినా అసలు బలం. మీలాంటి కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు.. నాయకుడికి కూడా మనుగడ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను ఎదుర్కొంటూ, ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సమావేశానికి రావడం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి బలమైన సంకేతమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. పార్టీ కష్టకాలంలో కూడా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసేవారే నిజమైన కార్యకర్తలని కొనియాడారు. ప్రస్తుతం ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్‌ను జిల్లాలో నెంబర్ వన్‌గా నిలపాలని కోరుకుంటున్నారని, కార్యకర్తల పోరాట స్ఫూర్తితో అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు “మళ్లీ కేసీఆర్ రావాలి.. కేసీఆర్ పాలనే బాగుండేది” అని చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనే ఉన్నారని, చేతల్లో ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, యూత్, రైతు డిక్లరేషన్లన్నీ ఇవాళ ఉత్త మాటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక “ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి” అని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దండగ ప్రభుత్వమని ఇవాళ సామాన్య ప్రజలే సోషల్ మీడియాలో బహిరంగంగా చెబుతున్నారని గుర్తుచేశారు. ప్రజల్లో వస్తున్న ఈ మార్పే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి నాంది పలుకుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాలుకు 12 కిలోల తరుగు తీస్తూ రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు రూ.200 కోట్ల రైతుల సొమ్ము తరుగు పేరుతో మిల్లర్లు, కాంగ్రెస్ నాయకుల మధ్య పంచుకుంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ దోపిడి రూ.2,000 కోట్లకు చేరిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని ప్రస్తావిస్తూ, రైతులు పండించిన పంట 45 రోజులుగా కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రావు, వచ్చినా సంచులు ఉండవు, మిల్లులకు పంపినా అన్‌లోడ్ చేయరని మండిపడ్డారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు కల్లాల వైపు కూడా చూడటం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే రైతుల తరఫున కల్లాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి పోరాడారని, ఆ ఒత్తిడి వల్లే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

 

Congress and BJP parties are fellow thieves

 

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, మోదీ కలిసి వ్యాట్ వేసి పెట్రోల్‌ను రూ.100 కు అమ్ముతున్నారని విమర్శించారని గుర్తుచేశారు. ఇవాళ రాష్ట్రంలో నీ ప్రభుత్వమే ఉంది కదా రేవంత్ రెడ్డి.. మరి 35 శాతం వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు? వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు రూ.65 కే పెట్రోల్ అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తోడు దొంగల పార్టీలని ఎద్దేవా చేశారు. పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ఎంతో కీలకమని పేర్కొంటూ, పార్టీ అధికారిక హ్యాండిల్స్ లేదా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పోస్టులను ప్రతి కార్యకర్త లైక్, షేర్, కామెంట్ చేయాలని సూచించారు.“ఇంగ్లీష్ రాకపోయినా పరవాలేదు.. జై కేసీఆర్, జై తెలంగాణ అని కామెంట్ పెట్టాలి అని అన్నారు. ఇక్కడ ఉన్న వెయ్యి మంది కార్యకర్తలు షేర్ చేస్తే అది లక్షల మందికి చేరుతుందని అన్నారు. అలాగే ప్రతి బూత్‌కు ఇద్దరు చొప్పున నియమించిన బూత్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేయాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఇంటింటికీ సర్వే కోసం వచ్చినప్పుడు బీఆర్ఎస్‌కు చెందిన బూత్ ఏజెంట్లు, గ్రామ ముఖ్య నాయకులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తున్నారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలి. కొత్తగా ఓటు హక్కు పొందే వారితో ఫారమ్‌లు పూర్తి చేయించి ఓటర్ల జాబితాలో చేర్పించాలి. అధికారంలో ఉన్న పార్టీ మన సానుభూతి ఓట్లను అన్యాయంగా తొలగించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బూత్ ఏజెంట్ ఓటర్ల జాబితాపై పూర్తి పర్యవేక్షణ వహించాలని పిలుపునిచ్చారు. మన ఓట్లను కాపాడుకోవడం, కొత్త ఓట్లను నమోదు చేయించడం ప్రస్తుతం అత్యంత కీలకమైన కార్యక్రమమని స్పష్టం చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అతన్ని కాపాడే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఒకరు “లొంగిపోయాడు” అంటుంటే, మరొకరు “అరెస్ట్ చేశాం” అంటున్నారని, అసలు నిజం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కుకు నిదర్శనమని అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ – బీజేపీలు కుమ్మక్కై పనిచేశాయని ఆరోపించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒంటరి పోరాటంతో 5 స్థానాలు గెలిపించారని, మరో కొన్ని స్థానాలు తక్కువ తేడాతో కోల్పోయామని పేర్కొన్నారు. తెలంగాణను సాధించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ దేనని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం కన్నా కేసీఆర్ ని బద్నాం చేయడమే ముఖ్య ఎజెండాగా మారిందని విమర్శించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలహీనపడిందనే ప్రచారంలో నిజం లేదని, ఈ సమావేశానికి తరలివచ్చిన భారీ జనసందోహమే దానికి నిదర్శనమని అన్నారు. కొంతమంది స్వార్థ నాయకులు పార్టీని వీడినా నిజమైన కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల నియంతృత్వ, అవినీతి పాలనను అంతమొందించడానికి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్త సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జ్ జీవన్ రెడ్డి, ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు జిల్లా బాధ్యులు విజి గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిశాంక్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, రాజారామ్ యాదవ్, కార్యక్రమం నియోజకవర్గ ఇంచార్జ్ ఉదయ భారతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Congress and BJP parties are fellow thieves