- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట రాజకీయాలు చేస్తూ – న్యాయస్థానాల పై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలు రెండు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు నేపత్యం లో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేని కపట ప్రేమను బయటపెట్టిందని, బీసీ రిజర్వేషన్‌ల పెంపు అంశంలో కాంగ్రెస్ తెలివిగా డ్రామా లాడుతోందన్నారు. “మేము పెంచాలనుకున్నాం, కానీ కోర్టు అడ్డుపడింది” అని న్యాయస్థానం పై నెపం నెట్టివేస్తూ బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. చెల్లదని తెలిసిన, బీసీ లను మభ్యపెట్టే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంపు జీ.ఓ జారీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ డ్రామాయేనన్నారు. అనంతరం మళ్లీ పార్టీ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేసిందని,ఈ ద్వంద్వ నాటకం ఎవరి కోసం? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నావని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే 10 వ షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేయాలన్న వాస్తవం తెలిసి కుడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42 శాతం అంటూ ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం మోసం చేసిందన్నారు. నేడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం అదే పాత బీసీ రిజర్వేషన్ డ్రామా మళ్లీ ప్రారంభించిందన్నారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా కాంగ్రెస్, గల్లీలో మాత్రం డ్రామాలు ఆడుతుందని, ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్‌ల పెంపు కోసం ధర్నా చేసినప్పుడు, కాంగ్రెస్ ఆదినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఇలా ఏ ఒక్కరూ అక్కడికి రాలేకపోవడం కాంగ్రెస్‌కి బీసీ లపై ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు. బీసీ రిజర్వేషన్ లపై ఉభయ చట్ట సభల్లో తీర్మానం చేసి గవర్నర్‌కి పంపినప్పుడు గవర్నర్ తొక్కిపెట్టడం, గతం లో తీర్మానం చేసి రాష్ట్రపతి కి పంపితే రాష్ట్రపతి కుడా ఆమోదం తెలుపక కపోవడం కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కి బీసీ లపై ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనమన్నారు. బీసీ ప్రధాని అంటూ గొప్పలు చెప్పుకునే మోడీ కూడా, కాంగ్రెస్‌తో కలిసి బీసీ రిజర్వేషన్‌ల పెంపు కాకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీయర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా చెబుతున్నాం, బీసీ రిజర్వేషన్‌ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే, మేము కూడా వారితో కలిసి వస్తామన్నారు. కానీ ప్రజలను మోసం చేసే కపట రాజకీయాలకు మేము సహకరించమన్నారు. ఇకనైన రేవంత్ రెడ్డి బీసీలను రాజకీయ లబ్ది కోసం వాడుకోకుండా రిజర్వేషన్ ల పెంపు పై చిత్త శుద్ధి తో పని చేయాలని బీయర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.