Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:59 pm Posted by : ramakrishna

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారం

 

. . . ఏర్గట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు పూర్ణానందం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, కమిషన్లు జరిగాయంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పూర్ణానందం ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ గృహ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మందికి ఇళ్లను అందజేసిందన్నారు. ఏర్గట్ల మండలంలో కూడా ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, సాంకేతిక కారణాలతో కొన్ని పనులు పూర్తికాకపోయినా వాటిని కమిషన్లతో ముడిపెట్టడం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సిందిపోయి, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. నిజంగా పేదల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు విడుదల చేసి మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఆయన హయాంలో ఏర్గట్ల మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలుసని, వాటిని ఎంతగా వక్రీకరించినా ప్రజలు నమ్మరని అన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నిలిపివేయాలని, లేకపోతే ప్రజలే తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.