Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 6:07 pm Posted by : ramakrishna

దొరల ఘడియలపై ఎర్రజెండా ఎగిరేసిన కామ్రేడ్ నర్సన్న

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అతి చిన్న వయసులో ఎర్రజెండా పట్టుకొని దొరల ఘడియలపై ఎర్రజెండా ఎగిరేసిన కామ్రేడ్ నర్సన్న విప్లవోద్యమంలో పనిచేస్తూ రహస్య జీవితం గడిపాడని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి భామండ్ల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగవ డివిజన్ మాధవ నగర్ కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో సిపిఐ (ఎంఎల్) నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరుడు కామ్రేడ్ గంగుల నర్సయ్య స్మారక స్తూపం నిర్మాణం కోసం కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో, రాష్ట్రాలలో కార్యక్రమాలకు పాల్గొని, ఆ కార్యక్రమాల సారాంశాన్ని ప్రజలకు వినిపిస్తూ నిజామాబాద్ జిల్లాలో పేద ప్రజల కోసం అందరిని ఏకం చేసి, ఇండ్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వ భూమిని పంచారన్నారు. ఈ సందర్భంగా తాను నిరంతరం విప్లవ జీవితం గడుపుతూ చనిపోయేంతవరకు పేద ప్రజల కోసం పనిచేయడం జరిగిందని, తన పోరాటాన్ని తన ఆశయాన్ని ఆచరణలో పెడుతూ తను నిర్మించిన కాలనీలో తన కోసం స్థూప నిర్మాణం చేపట్టాలని ఆయనన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆర్థిక సహాయ సహకారాలు అందించి స్తూప నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్ల మల్లేష్, కత్తుల మారుతి, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, కొండ అనూషవ్వ, శంకర్, నరసింహులు, రజియా, బాల గౌడ్, నాయకులు యాది మల్లు, దుర్గయ్య, గోపి బన్సీ, కళావతి లక్ష్మి, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.