సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ సభ్యురాలు కామ్రేడ్ అనసూయక్క సంతాప సభను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నిర్వహించారు. ముందుగా కామ్రేడ్ అనసూయ చిత్రపటానికి పూలమాలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించగా, ముఖ్యవక్తగా విచ్చేసిన పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కామ్రేడ్ అనసూయ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవిత సహచరిగా, పార్టీ కార్యకర్తగా నిబద్ధతతో జీవించారన్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే కామ్రేడ్ యాదగిరి పార్టీకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినా, అనసూయ ఎదురు చెప్పలేదన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో కామ్రేడ్ యాదగిరి రహస్య జీవితంలోకి వెళ్ళారని, అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టి, గర్భిణిగా ఉన్న అనసూయ కష్టాలు రెట్టింపైనా కష్టనష్టాలను ఓర్చుకుందన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా పోలీసులు కామ్రేడ్ యాదగిరిపై నిర్బంధాన్ని, దాడులను వేధింపులను, మరోవైపు అతివాద పీపుల్స్ వార్ దళాల భౌతిక దాడులకు అనసూయక్క బెదరలేదన్నారు. పార్టీ స్పిరిట్ ను వదలలేదన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డా, కష్టాలకు వెరవకుండా, కుటుంబ భారాన్ని మోశారన్నారు. ఇద్దరు కూతుళ్లు, కొడుకు కులాంతర, ఆదర్శ వివాహాలను అనసూయక్క సంపూర్ణంగా స్వాగతించారన్నారు. కామ్రేడ్ యాదగిరన్న పార్టీ పనుల్లో తలమునకలై ఉంటుంటే, అనసూయక్క కుటుంబ బాధ్యతలను మోశారన్నారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదన్నారు. పార్టీ ఇచ్చిన అలవెన్స్ లతోనే సర్దుకుంటూ, అతి సాధారణ జీవితం గడిపారన్నారు. జీవితాంతం పార్టీనీ కుటుంబంగా భావించి, పార్టీ పద్ధతిలోనే జీవించారని కొనియాడన్నారు. చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను లయన్స్ క్లబ్ కు, వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన శరీరాన్ని దానం చేసి ఆదర్శమయ్యారన్నారు. కామ్రేడ్ యాదగిరన్న జీవిత సహచరిగా, పార్టీ సభ్యురాలిగా కామ్రేడ్ అనసూయక్క జీవితం పార్టీ కుటుంబాల్లోని మహిళలకు ఆదర్శనీయమన్నారు. ప్రజా గాయకుడు సిర్ప లింగన్న తన పాటలతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సుధాకర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, భాస్కర్, రామ్మోహన్ రావు, ఏ.రవీందర్, సాయన్న, సురేష్, కిషన్, మురళి, కే.గణేష్, వి.గోదావరి, సుధారాణి, కే.సంధ్యారాణి, భాస్కరస్వామి, నారాయణ, సాయిబాబా, మోహన్, గంగారాం కామ్రేడ్ అనసూయక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
