Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 6:29 pm Posted by : ramakrishna

పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించాలి

 

. . . సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శ ఎం.సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని ఎన్.ఆర్. భవన్‌లో పార్టీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా, వాటిని ఇప్పటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడంతో ఇళ్లకు నష్టం జరుగుతోందని తెలిపారు. కిటికీలు, తలుపులు దొంగతనాలకు గురికావడంతో పాటు భవనాలు మరమ్మతులకు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్లకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో గృహాలు నిర్మించి ఇవ్వాలని, నగరానికి కేటాయించే ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంచాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు తాగునీటి పైపుల లీకేజీలను అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి, జిల్లా అధ్యక్షుడు కే. గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అషూర్, పీవైఎల్ నాయకుడు మారుతి, జిల్లా నాయకుడు టియుసీఐ జిల్లా నాయకుడు లింగం తదితరులు పాల్గొన్నారు.