Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:23 pm Posted by : ramakrishna

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు

 

. . . నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్దం కావాలి

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

సంగారెడ్డి, బతుకమ్మ :

 

ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇకపై ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ఏ ఖాళీని కూడా గాలికి వదిలేయబోమని స్పష్టం చేసిన ఆయన.. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతులు, మహిళలు, యువతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్కెట్‌లో వాటి ధర కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గిందన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత 32 నెలల్లో రైతులు పండించిన పంటల కొనుగోలుకు రూ.90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి 25 లక్షల మంది రైతులను రుణభారం నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచి, ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులను రాజులా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వానిదని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం రూ.11 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళలకు కేటాయించామని, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించడంతో పాటు చేనేత, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా బాధితులకు కూడా పెన్షన్ అందించాలని నిర్ణయించామని చెప్పారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ తమ ప్రభుత్వ బాధ్యత అని, అన్ని పోటీ పరీక్షలను నిర్వహించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులకు వడ్డీలు చెల్లిస్తూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఏటా రూ.75 వేల కోట్లు అప్పుల చెల్లింపులకు వెచ్చిస్తున్నామని తెలిపారు. సంక్షోభంలో ఉన్న సంక్షేమ పథకాలను గాడిలో పెట్టి అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొంటూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

 

Competitive exams every six months