Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 3:03 pm Posted by : ramakrishna

సమస్యల సత్వర పరిష్కారానికి వేదిక కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజల తమ చిన్నచిన్న సమస్యల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత విద్యాశాఖ కార్యాలయ భవనంలో మంగళవారం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పల్లెటూర్లలో చిన్నచిన్న తగాదాలు వస్తే గ్రామంలోని పెద్దల సమక్షంలో పరిష్కరించుకునే వారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైందని, పోలీస్ స్టేషన్ లను, కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్ లలో జాప్యం, కోర్టుల్లో ఎన్నో కేసులు ఉండడంతో జాప్యమవుతోందని, బాధిత కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు.  జిల్లాలో మొత్తం నాలుగు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ లు ప్రారంభించినట్లు తెలిపారు. కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ పైన ఏర్పాటు చేసిన సెంటర్ కు వచ్చేందుకు కొంత మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పాత డీఈవో కార్యాలయంలో సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ సెంటర్ కు ముత్యాల రవీందర్, కుంచం శ్రీనివాస్, దేవ భక్తుని వాసుదేవరావు, లక్ష్మీపతి, ఎజాస్ ఇన్ చార్జీలుగా కొనసాగుతారన్నారు. సెంటర్ ను సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. మీడియా సైతం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మీడియేషన్ సభ్యులకు మూడు రోజులపాటు నిజామాబాద్ జిల్లా కోర్టులో ట్రైనింగ్ ఇచ్చామని, ట్రైనింగ్ ఇచ్చిన నెలలోపు 30 అప్లికేషన్లు వచ్చాయని దాంట్లో 10 అప్లికేషన్లు సెటిల్మెంట్ చేశారని న్యాయమూర్తి వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, కోర్టు సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Community Mediation Center is a platform for quick resolution of issues