- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : ప్రజల భద్రత కోసం శాంతిభద్రతలతో కూడిన సమాజాన్ని అందించడానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని అందులో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గురువారం తెల్లవారుజామున నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో 235 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రవాణా నియమాలను ఉల్లంఘించిన 11ఆటోలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ వాహనదారుడు విధిగా వాహనానిని సంబంధించి పత్రాలను కలిగి ఉండాలన్నారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. రౌడీషీట్లు, సస్పెక్ట్ షీటర్స్ పై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ ఇన్స్ పెక్టర్ నరహరి, కామారెడ్డి రూరల్, భిక్నూర్, సదాశివనగర్ ఇన్స్ పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
