హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ సోమాజిగూడలోని హెడ్‌క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తుపాకీతో ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపింది. అక్టోబర్ 24 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రెండో అంతస్తులో కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు. అనంతరం వారిలో ఒకరు సెల్లార్‌లో పార్క్ చేసిన తన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి రివాల్వర్ తీసుకుని తిరిగి రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బౌన్సర్ గణేష్ అతడిని అడ్డుకుని సెల్లార్ వైపు తీసుకెళ్లారు. అయితే రాత్రి 12:40 గంటల సమయంలో అతడు మళ్లీ సెల్లార్‌లోకి వెళ్లి కస్టమర్లు, బౌన్సర్లపై రివాల్వర్ చూపిస్తూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిల్లు రూపంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కాల్చి చంపుతానని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌లోని ఓవైసీ కాలనీ, అచిరెడ్డినగర్‌కు చెందిన మహమ్మద్ షానవాజ్ (24)గా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, మహీంద్రా థార్ వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బార్ బౌన్సర్ బచ్చు, బంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది.