- తుది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ముస్తాబైంది. తుది ఏర్పాట్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టరేట్ లో నిర్వహించనున్న ఈ వేడుక కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, సీ.పీ ప్రజాపాలన దినోత్సవ తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వేదిక, ఆహూతులకు సిటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
