Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 8:14 pm Posted by : ramakrishna

పసుపు పంట క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉన్న నేపథ్యంలో, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం మునిపల్లి శివారులోని పసుపు పంట క్షేత్రాలను సందర్శించారు. ఆలూరి పెద్ద మల్లయ్యకు చెందిన పసుపు సాగు క్షేత్రాన్ని ఆసక్తితో పరిశీలించారు. పసుపు సాగు విధానం, నేల స్వభావం, అనుకూలమైన రకాల గురించి రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పసుపు తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి, పసుపు పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయు విధానం ఇలా విడతల వారీగా ప్రాసెసింగ్ ప్రక్రియ గురించి రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  పసుపులో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల మార్కెట్లో పసుపు కు మంచి ధర వస్తుందని, ఎక్కువ తేమ శాతం ఉన్న పసుపునకు తక్కువ రేటు రావడం జరుగుతుందని తెలిపారు.

 

Collector visits turmeric fields

 

తేమ శాతం 12-15 మోతాదులో  ఉన్న పంటకు మార్కెట్లో ప్రస్తుతం మంచి రేటు పలుకుతోందని రైతులు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. అయితే అకాల వర్షాల వల్ల కల్లాలు లేనందున పసుపు తడిసిపోయి నాణ్యత దెబ్బతిని నష్టపోతున్నామని, కమ్యూనిటీ కల్లాలు ఏర్పాటు చేయాలని కోరుతూ  గ్రామ సర్పంచ్ ముస్కు సాయి రెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, శ్రీనివాస్ గారు, మండల ఉద్యానశాఖ అధికారి రాజు, మండల వ్యవసాయ  అధికారిణి దేవిక, ఏఈఓ భాస్కర్ నాయక్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, రైతులు ఉన్నారు.

. . . నిజామాబాద్ మార్కెట్ యార్డు సందర్శన

అనంతరం కలెక్టర్ నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పసుపు నిల్వలను పరిశీలించారు. పసుపు పంటకు లభిస్తున్న గిట్టుబాటు ధర, క్రయ విక్రయాల గురించి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని, కార్యదర్శి అపర్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ.నామ్ విధానం ద్వారా పంట కొనుగోలు ప్రక్రియ గురించి ఆరా తీశారు. రైతులు నష్టపోకుండా, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

Collector visits turmeric fields