Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 4:36 pm Posted by : ramakrishna

సిద్ధాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన కలెక్టర్

వర్ని, బతుకమ్మ: వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగు నీటి సౌకర్యం లేని నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, నిర్మాణ పనుల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్, తాజాగా శుక్రవారం మరోమారు క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. బండ్ నిర్మాణం నిమిత్తం సరిహద్దు ప్రాంతాల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు చెందిన అధికారులతో పరిశీలన జరిపారు. వాహనాలు వెళ్ళేందుకు వీలు లేకపోవడంతో కాలి నడకన వాగులు, కొండలను దాటుతూ, రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుండి ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. హద్దుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్, ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ, పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. అటవీ భూమి అవసరం అయిన పక్షంలో భూసేకరణ, అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు.

Collector visits Siddapur Reservoir