Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 3:13 pm Posted by : ramakrishna

బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ 

 

 

.  . .  మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం

 

.  . . ఓ.పీ సేవలను మరింతగా పెంపొందించాలని ఆదేశం

 

బోధన్, బతుకమ్మ : 

 

బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. అనంతరం జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిని అనునిత్యం ఎంతమంది రోగులు సందర్శిస్తున్నారు, ఎక్కువగా ఎలాంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం వస్తున్నారు అని ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు డాక్టరు సేవలు అందుబాటులో ఉన్నందున మరో గైనకాలజిస్టును నియమించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు సైతం చొరవ చూపుతానని అన్నారు. అయితే రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ముఖ్యంగా అవుట్ పేషంట్ రోగులకు అందిస్తున్న సేవలను మరింతగా పెంపొందించాలని అన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్ లో ఫుడ్ పాయిజనింగ్, డీహైడ్రేషన్ వంటి కేసులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను, వైద్యులను, సిబ్బందిని సమకూరుస్తామని, అయినా కూడా వైద్య సేవలలో లోపాలు ఉంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని రకాల ఆరోగ్య సేవలను స్థానికంగానే అందించాలని, అత్యవసరం అయితేనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలని సూచించారు.

Collector visits Government District Hospital in Bodhan