Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:31 pm Posted by : ramakrishna

బోధన్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

 

. . . మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు నిధులు మంజూరు

 

. . . మెరుగైన సేవల ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని వెల్లడి

 

. . . హాస్పిటల్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

 

. . . ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ అసంతృప్తి

 

. . . పారిశుధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం 

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ తదితర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డితో కలిసి బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్లను నిశితంగా పరిశీలించారు.

 

Collector visits Government District Hospital in Bodhan.

 

ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. బాన్సువాడ తో పాటు సరిహద్దు ప్రాంతాల నుండి గర్భిణీలు ఈ ఆసుపత్రిని సందర్శిస్తున్నారని, ప్రతి నెల సగటున 200 వరకు కాన్పులు జరుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రిలో బర్త్ వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మెడికో లీగల్ కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నందున, భద్రతాపరమైన అంశాల రీత్యా బోధన్ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీసు శాఖకు ప్రతిపాదిస్తామని తెలిపారు.

 

Collector visits Government District Hospital in Bodhan.

 

వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను, వైద్యులను, సిబ్బందిని సమకూరుస్తామని, అయినా కూడా వైద్య సేవలలో లోపాలు ఉంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. స్థానిక ఆర్డీఓ నేతృత్వంలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి, ఆసుపత్రి నిర్వహణ తీరుతెన్నులపై తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

Collector visits Government District Hospital in Bodhan.