ల్యాబ్ గదుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపండి
స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలని ఆదేశాలు
నిజామాబాద్, బతుకమ్మ : మెండోరా మండలం పోచంపాడ్ లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను గమనించిన కలెక్టర్, ప్లే గ్రౌండ్ గురించి ఆరా తీశారు. అర్థాంతరంగా నిలిచిపోయిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు. కిచెన్ లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలని, 500 పైచిలుకు మంది విద్యార్థినులు కొనసాగుతున్నందున అన్నం, ఇతర ఆహార పదార్థాలు శుచి, శుభ్రతతో చక్కగా వండడానికి ఉపకరిస్తుందని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ పోచంపాడ్ ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ, మధుమేహం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్ చార్జి జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, స్కూల్ ప్రిన్సిపల్ గోదావరి, పీ.హెచ్.సీ మెడికల్ ఆఫీసర్ రాకేశ్ తదతరులున్నారు.
