Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 3:30 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్. బతుకమ్మ :  వర్ని మండలం జాకోరా, జలాల్పూర్ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా, కొత్త గన్నీ బ్యాగులు అందాయా అని ఆరా తీశారు. గత ఏడాది ఇదే సీజన్ లో ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఈసారి రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తరలించేందుకు అవకాశం ఉందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించారు. కొనుగోలు కేంద్రాలకు కాకుండా రైతులు ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారా? అని కలెక్టర్ ప్రశ్నించగా, అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉండడంతో కొంతమంది రైతులు ధాన్యం తడిచిపోతుందనే ఉద్దేశ్యంతో పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, అత్యధిక మంది కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తెస్తున్నారని స్థానిక అధికారులు సమాధానం ఇచ్చారు. తేమ కొలిచే యంత్రం ద్వారా ధాన్యం తేమ శాతాన్ని, క్యాలిపర్ సహాయంతో ధాన్యం నిర్ణీత కొలతలతో కూడి ఉన్నదా లేదా అని స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా, సరిపడా టార్పాలిన్లను అందుబాటులో  ఉంచాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేర తూకం యంత్రాలను సమకూర్చాలని, గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై పెద్ద ఎత్తున ధాన్యం ఆరబెట్టడాన్ని గమనించిన కలెక్టర్, అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం, కుప్పలుగా చేసి నిలువ ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాలు, మైదాన ప్రాంతాలలో ధాన్యం ఆరబెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ తదితరులున్నారు.


Collector inspects grain purchase centers