Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 5:46 pm Posted by : ramakrishna

మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమంతులు మంజూరు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.