Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:15 pm Posted by : ramakrishna

జన గణన స్వీయ నమోదు చేసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

. . . స్వీయ గణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జన గణన ప్రక్రియలో భాగంగా జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరేట్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జన గణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26 నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి (ఎస్ఈఐడి) జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ధృవీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని అన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు.

 

Collector Ila Tripathi, who self-registered for the census

 

అయితే, స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లను నియమించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జన గణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.