Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 8:25 pm Posted by : ramakrishna

మోపాల్, ముదక్ పల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

  • వసతి గృహాలు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన

 

నిజామాబాద్, బతుకమ్మ  : మోపాల్, ముదక్ పల్లిలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముదక్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. మోపాల్, ముదక్ పల్లి హాస్టళ్లను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్ రూమ్ లను తనిఖీ చేసి, వార్డెన్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ప్రతి రోజు ఫేస్ రికగ్నిషన్ ద్వారా వంద శాతం హాజరు నమోదు జరగాలని అన్నారు. వసతి గృహాలలో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు పరిశీలించి, ఇంకనూ ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు.

అంతకుముందు కలెక్టర్ మోపాల్ ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్ల గురించి ఎంపీడీఓ రాములు నాయక్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాను పరిశీలించి, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా పరిశీలన చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్ధవంతంగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి డిప్యూటీ తహసీల్దార్ సరిత ను ఆరా తీశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

Collector conducts surprise inspections in Mopal and Mudakpally