Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 5:22 pm Posted by : ramakrishna

డొంకేశ్వర్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

  • తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన
  • భూభారతి దరఖాస్తులపై సమీక్ష
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ ఆర్జీలపై ఆరా

 

డొంకేశ్వర్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా ఆన్ లైన్లో అన్ని అంశాలను అప్లోడ్ చేశారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి, స్పష్టమైన కారణాలను పేర్కొనాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువు లోపు ఎస్.ఐ.ఆర్ పూర్తి చేయాలని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరీలపై ఆరా తీశారు. దరఖాస్తులు అందిన వెంటనే అర్హులైన వారిని గుర్తిస్తూ వెంటవెంటనే

Collector conducts surprise inspections in Donkeswar

మంజూరీ జాబితాలు పంపాలని ఆదేశించారు. ఆధార్ అవసరం అయిన విద్యార్థులకు జనన ధృవీకరణ పత్రాలను సత్వరమే మంజూరు చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ఇంకనూ పది శాతం వరకు వరి కోతలు మిగిలి ఉన్నాయని నిర్వాహకులు తెలుపగా, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల వద్ద దొడ్డు రకం ధాన్యం సైతం సకాలంలో దిగుమతి చేసుకునేలా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా అన్ లోడింగ్ చేసుకోకపోతే నేరుగా తన దృష్టికి తేవాలని కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా, సకాలంలో ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని, తద్వారా రైతుల ఖాతాలలో వెంటనే బిల్లులు జమ అవుతాయని అన్నారు. రైతు వేదికను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ధాన్యం అమ్మకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీయగా, అలాంటిదేమీ లేదని ధాన్యం అమ్మకాలు సాఫీగా జరిగాయని రైతులు తెలిపారు. వరితో పోలిస్తే అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. రబీ సీజన్ కు సంబంధించి కూడా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాలికాబద్దంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ నరేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ తదితరులు ఉన్నారు.

Collector conducts surprise inspections in Donkeswar