Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 4:02 pm Posted by : ramakrishna

ఐడీఓసీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్, బతుకమ్మ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి, ఆ శాఖల పనితీరును సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించి రూపొందించిన నివేదికలు పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వపరంగా సహాయం అందేలా పక్కాగా పంట నష్టం వివరాలు పొందుపర్చాలని సూచించారు. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, వేల్పూర్, వర్ని మండలాలలో పలు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిందని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈజీఎస్ కూలీలచే ఈ ఇసుక మేటలు తొలగింపజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ.ఓలు, ఏ.ఈ.ఓలు, ఇతర వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇసుక మేటలు వేసిన పంట భూముల వివరాలను ఉపాధి హామీ అధికారులకు అందిస్తే,

Collector conducts surprise inspections at IDOC

వారు ఈజీఎస్ కూలీలచే ఇసుక మేటలు తొలగింపజేస్తారని, పరస్పర సమన్వయంతో రైతులకు ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. ఈజీఎస్ కాంపోనెంట్ కింద అన్ని జీపీల పరిధిలో విరివిరిగా పనులు గుర్తిస్తూ, వాటిని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ సాయాగౌడ్ ను ఆదేశించారు. తద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. హౌసింగ్ శాఖను తనిఖీ చేసిన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. మంజూరీ తెలుపబడిన లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల వివిధ దశలను అనుసరిస్తూ లబ్దిదారులకు వెంటదివెంట బిల్లులు వారి ఖాతాలలో జమ అయ్యేలా చూడాలన్నారు.. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఈ.ఈ నివర్తి తదితరులు ఉన్నారు.

  • నగర పాలక సంస్థ కార్యాలయం సందర్శన..

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. కార్పోరేషన్ లోని వివిధ విభాగాల పనితీరు గురించి కమిషనర్ దిలీప్ కుమార్ తో సమీక్షించారు. నగర పాలక సంస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

Collector conducts surprise inspections at IDOC